12, మే 2017, శుక్రవారం

పద్యాల తో "రణం": ఐదవ భాగం

"జడ పదార్ధములతో మాట్లాడగ వచ్చుఁనె" - రమేష్ వేమూరి

1) మధుబాల కరవది

చూడ ముచ్చటైన జడ, పూల జడ
ముద్దుగా కలికి నడుముల కులుకు జడ
చూచి మెచ్చి మురువ వలెగాని, నరుడా  
జడ పదార్దములతో మాట్లడ వచ్చునే

2) 3విక్రమ్ సింగరాజు

దడ పుట్ట బుసకొట్టు చెవుచుట్టు నసపెట్టు, ఎడాపెడా జగడముతో
గడగడ వణికించు పడతులతో - తొడగొట్టి తలపడి మెడలువంచుట,
ఉడుము పిడికిళ్లు విప్పుట, పుడమంత కుడుము మింగచూడుట
కడలి సుడుల - మోసలి మడుగుల అడుగిడుటయేనని యెరిగి మూత
పడ్డ నానోరు, మరుల జడ పదార్ధములతో మాటలాడగ వచ్చునే?

3) సాయి సోమయాజుల

నేను ఊటీ యనగ తాను ఉడిపి యనియె
నేను గోవా యనగ తాను కోవెల యనియె
నేను మూవీ యనగ తాను మూగ నోమనియె
ఇట్టి జడ పదార్ధములతో మాట్లాడవచ్చునే

4) శేషు అప్పారావు

ముచ్చటగ మూడు మాటలనడు  సతితో
పాక శాస్త్ర ప్రావీణ్యము సున్న రుచుల ప్రస్తావన మిన్న
మహి నేలు అర్ధాంగికి అండగా నిలబడడు
మరుల జడ పదార్ధములతో మాటలాడగ వచ్చునే?

5) గీత దేసు

కొత్త పెళ్ళాం బెల్లమనెను, ఏమి వండినను లొట్టలేసేను
నువ్వే నా రాణి వనెను, ఏమి చేసినా ముద్దు గొలిపెను  
రెండు నాళ్ళకే  పాతదయ్యెను, ఏమి పలికినా జగడ మనెను
ఒక్క పనికే అలుపు అనెను, ఎంత కోరినా ఒల్లకుండెను
వామ్మో , జడ పదార్ధములతో మాటలాడగ వచ్చునే ?

6) కులశేఖర మడుపు

గడబిడ జరిగిన శీలము
జడమై పోయె నహల్య, శక్తులు పొయే
అడుగులు రాముని సోకగ
జడ పదార్ధములతోడ మాటలువచ్చెన్

7) రమేష్ వేమూరి

"కుదిరితే కప్పు కాఫీ, వీలైతే నాలుగు మాటలు వీడి
కాలక్షేపపు కబుర్లు, మధురమైన సంభాషణలు వదిలి
చరవాణి చేతబట్టి మూగబోయిన సమకాలీన
'జడ' పదార్ధములతో మాట్లాడగ వచ్చుఁనే"

పద్యాల తో "రణం": నాల్గవ భాగం

"ఊరకరారు మహానుభావులు ఉగాది కవిత తోడుగ వచ్చెన్" - సాయి సోమయాజుల

1) రమేష్ వేమూరి

క్రొత్త ఆశలతో దుర్ముఖికి వీడ్కోలు చెప్పెన్
మామిడి చిగుళ్లతో కోయిల కూతలు వచ్చెన్
ఉగాది షడ్రుచులతో హేవిళంబి వచ్చెన్
ఊరక రారు మహానుభావులు ఉగాది తోడుగ వచ్చెన్

2) 3విక్రమ్ సింగరాజు

ఊరికే అందాలు ఒలకపోసే వెన్నెలలు, కనుల
కూరటకలిగించే పచ్చటి చిగుళ్లు
ఉరకలు వేసే యెడ్లు, వాటి బండ్ల నిండా ఒడ్లూ, గండు కోకిళ్ల
సరాగాలు, నిండు వసంతం కొమ్మనమామిళ్ళు- రమ్మన,
ఊరకరారు మహానుభావులు ఉగాది కవిత తోడుగ వచ్చెన్

ఊరకుండరు ఉరుకులెడతారు, ఊరమెరపల్లా కయ్యిమంటారు,
ఉల్కముక్కల్లా ఉరిమి పడతారు,  ఊరకుక్కల్లా మొరుగుచుంటారు,
ఊయల జడలతో ఉరిబిగిస్తారు, ఊరువులతో ఉప్మాచేసి ఉదరపాకలి బాపమంటే, తీరికలేదు
ఊరటకు సద్దిగిన్నెలూడ్చమంటారు, అన్నన్నా అట్టి ఆడవారు నేడు  
ఊరకరారు మహానుభావులు ఉగాది కవిత తోడుగ ఎటుల వచ్చెన్?

3) 

పద్యాల తో "రణం": మూడవ భాగం

"'జోడు గుఱ్ఱముల స్వారీ చేయ తగునా " - రమేష్ వేమూరి

1) సాయి ప్రసాద్ సోమయాజుల

ఆగని మాయా మోహ జగమొక వైపు
సాగని ఆధ్యాత్మిక యాత్ర వేరొక వైపు
జగమున నీకు అగచాట్లు తప్పవా నాయనా
జోడు గుఱ్ఱముల స్వారీ చేయ దగునా

2) 3విక్రమ్ సింగరాజు

జోడుచ్చుక్కోట్టే దొకటి, మంచం కోడుక్కటేసేదొకటి
మాడు పగలాదీయునొకటి, తలలు బోడులు చేయునొకటి, చెలి
కాడు వేంకన్నకు చెల్లునేమోగాని, రెండు పడవలపై  కాళ్లూ
జోడు గుఱ్ఱముల స్వారీ, చేయదగునా అల్ప విక్రమునకున్?

3) మధుబాల కరవది

ఇంట సాద్వీమణి వోలే
బయట  ఝన్సీ రాణి వోలే
ఇంటా బయటా  గెలుచుటకై నేటి నారి
జోడు గుర్రముల స్వారీ చేయ తగునే

జోడు గుర్రముల స్వారీ చేయ తగునా అని
ఔర! నవ నారిమణిని అడుగుట తగునా
నేటి నారి ఇంటా బయటా గెలవాలంటే
జోడు కాదు మెండు గుర్రముల స్వారీ చేయవలె

4) కులశేఖర మడుపు

రెండు  భాషలు మెండుగా చదివి
పండితు లైన  పడుచున్న
పద్య రచనలు భారమా?
జోడు గుఱ్ఱముల స్వారీ చేయవచ్చు

5) గీత దేసు

అమెరికా హంగు బొంగులు ఒక వైపు 
భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు మరియొక వైపు 
సాకర్ ముఖ్యమా కూచిపూడి ముఖ్యమా అని తికమక పడుతున్న తల్లిదండ్రులు 
ఈ జోడు గుఱ్ఱముల స్వారీ చేయదగునా !

5)రమేష్ వేమూరి

జోడెద్దుల వ్యవసాయము చేయవచ్చు, సాలుకు
జోడు ఫసల ఫలసాయము నందవచ్చు, మరల
జోడు సతుల పెరుమాళ్ళ త(కొ)లచవచ్చు, అంత
జోడు గుఱ్ఱముల స్వారీ చేయదగునా

14, ఏప్రిల్ 2012, శనివారం

పద్యాల తో'రణం' (సమస్యా పూరణం)

భావకులరా!
ఉగాది పండుగ తరువాత మీ భావావేశాన్ని ప్రక్కన పెట్టి నిత్య జీవన పోరాటంలో నిమగ్నం అయిపోయారా!? అయితే, మన పద్యాల తో'రణం' శీర్షిక క్రింద మీకొక పద్య సమస్యను ఇస్తున్నాను. దీనిని మీరు పద్య కవితగా కానీ, వచన కవితగా కానీ సమస్యా పూరణం చెయ్యవచ్చు.   

ఫెళ్ళున మధ్యకు విరుగగ
భళ్ళున తెల్లారిపోయె బ్రతుకులు ఎన్నో


ఇక మీ ఒర నుండి కవితా ఖడ్గాలను బయటకు తీసి ఝుళిపించండి, గురువారం 19 ఏప్రిల్ 2012 వరకు మీ కవితలను కురిపించండి!

మనకు (తెలుగువాహిని సభ్యులకు) ఛందస్సు నేర్పుతున్న గురువు శ్రీరామం గారికి నమస్కారాలతో.

1, ఏప్రిల్ 2012, ఆదివారం

మత్సరము లేని సంవత్సరము

ఓ అందమైన శ్రీ నందన నామ యుగాదీ నీకు వందనమమ్మా!

ధనమే ఇంధనమై నడుస్తున్న ఈ జగత్తులో
మనసు లేని అందాలపై మమకారం మాకు తగ్గించు.


గతించిన గతాలను బేతాళుని శవాల్లా భుజాన వేసుకొని
వర్తమానంలో భారంగా అడుగులు వేస్తున్న మా బరువులను తొలగించు.

ఓ అందమైన శ్రీ నందన నామ యుగాదీ నీకు వందనమమ్మా!

గతంలోని లోపాలను, చేసుకొన్న పాపాలను
పదే పదే నెమరు వేయు పాడు జీవితాలన్నీ ప్రక్షాళన చేయించు.

వర్తమానాన్ని గతానికి బలి ఇస్తూ, భవిష్యత్తుపై 'భయం' కొరడాలను ఝుళిపిస్తూ
బ్రతుకీడ్చే ఈ నికృష్టపు జీవన శైలిని మార్పించు.

ఓ అందమైన శ్రీ నందన నామ యుగాదీ నీకు వందనమమ్మా!

ఇహం లోని దేహానికి అహం బాగ తగ్గించు
భార్యా భర్తల మధ్య పంతాలూ, పట్టింపులు తొలగించు. ప్రేమ తత్వాన్ని పెంపొందించు.
మిత్రుల మధ్య డాంబికాలను తొలగించు, పరస్పర గౌరవం వృద్ది పొందించు.

బట్టలు, నగలు, వస్తు వాహనాలపై వ్యామోహం తగ్గించు,
మేము ఈ భూమికి పుట్టిన రాచ పుండులము కారాదని దీవించు!


ఓ అందమైన శ్రీ నందన నామ యుగాదీ నీకిక స్వాగతమమ్మా!!