మనం కొన్ని పదాలు, వాక్యాలు, భావాలు, వింటుంటాము కానీ లోతుగా పరిశోధించం. పరిశోధించడానికి ప్రయత్నం కూడా చెయ్యం. పైపైన తెలిస్తే చాలనుకుంటాము. అంతరార్ధం తెలియక పోయినా పర్వాలేదు అనుకుంటాము. కాని, ఒక్క సారి మనకి తెలియని అంతరార్ధం - అది ఎంత చిన్న విషయమైనా కావచ్చు - తెలిస్తే, ఎంత ఆనందంగా, గర్వం గా ఉంటుందో ఈ మధ్య నే నాకు స్వయం గా అనుభవం అయ్యింది. అది తెలిసిన తర్వాత - ఇంత చిన్న విషయం ఎప్పుడూ ఎందుకు విశ్లేషించ లేదా - అనిపించింది.
ఈ మధ్య - మా పెద్ద వాడికి గ్రేడ్ 9 ఇంగ్లీష్ poetry ప్రాజెక్ట్ లో హెల్ప్ చేస్తూంటే, ఒక మాతృ భాష (తెలుగు) పద్యాన్ని ఆంగ్లం లోకి అనువదించి, మన మాతృ భాష గురించి ఒక రెండు వాక్యాలు రాయాల్సిన అవసరం పడింది.
మన మాతృ భాష గురించి ఎన్నాళ్ళు గానో వింటున్న ఒక పోలిక "తెలుగు ఈస్ ద ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్" అని రాయమని చెప్పాను.
కాని ఎందుకలా అంటారో అని మా పెద్దాడు అడిగితే - సమాధానం చెప్పలేక పోయాను. ఎందుకంటే - నాకే తెలీదు. ఇద్దరమూ కలసి వికీపీడియా లో వెతికాము. ఒక సమాధానం తెలిసింది. ఇటాలియన్ లొనూ తెలుగు లొనూ చాలా పదాలు అచ్చులతో (వొవెల్స్ తో) అంతం అవుతాయట. ఉదాహరణకి - పిజ్జా (అకారంతం), macaroni (ఇకారాంతం) ఇవి ఇటాలియన్ భాష పదాలు. మన తెలుగు లోనూ అంతే కదా - కిటికీ (ఇకారాంతం), అటక (అకారాంతం) తదితరాలు.
విషయం చిన్నదే కావచ్చు; మనలో చాలా మందికి తెలిసినదే కావచ్చు. కాని - నాకు తెలీదు. ఈ సందర్భంలో జిడ్డు కృష్ణ మూర్తి గారు తరచుగా చెప్పే ఒకే ఒక తత్త్వం గుర్తుకొస్తుంది.
"తెలియకపోతే - శోధించు".