23, జనవరి 2020, గురువారం

మా ఇంట సంక్రాంతి - మొదటి భాగం


ఇది మా చిన్న నాటి విజయనగరం లో మా తాత గారింట్లో సంక్రాంతిపండుగ జ్ఞాపకాల నుండి తవ్వి తీసిన కొన్ని రతనాలు
మొదటి భాగం
మేము విజయనగరం లో  చిన్నప్పుడు ఉండే మా తాత గారి ఇంటిగురించి ఇంతకు ముందు కధలలో వర్ణించి ఉన్నాను.  ఇంటి సింహద్వారం ఒక వీధి లో ఉంటె, పెరడు ఇంకొక వీధి లో ఉండేదని, మా తాతగారి ఇల్లు రెండు వీధులను సంధి చేస్తూ ఉండేదని. 
వీధి లోంచి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక మందుల దుకాణం (ఫార్మసీ),  ఫార్మసీని దాటుకుని పక్కనే ఉన్న వరండా లో వెళితే కొట్టు గది , భోషాణం పెట్టె గది, జాఫ్రీ వరండా, అది దాటగానే  ద్రాక్ష పందిరి నే పైకప్పుగా చేసుకున్న మండువా లోగిలి, ఆ మండువా లోగిలి కి కుడి పక్కనదేవుడి గది, ఎడమ పక్కన చాలా దూరం గా బాత్రూం, కొళాయి గట్టు, ఆగోడ వెనుక దొడ్లు, ఆ మండువా లోగిలి ని దాటి వెళితే, పెద్ద మీదఅనబడే రెండంతస్తుల మేడ,  ఒక్కో అంతస్తులోనూ వరుసగా నాలుగేసిగదులు, ప్రతీ అంతస్తు కి ఒక బాత్రూం, ఒక వంటిల్ల్లు, ఆ పెద్ద మేడ నిదాటుకుని పక్కనే ఉన్న సందులో నుంచి వెళితే,  పెద్ద మేడ వెనుక పక్కఇంకొక ద్రాక్షపందిరి ని పై కప్పుగా చేసుకున్న ఇంకొక మండువా లోగిలి,  అది దాటి వెళితే చిన్న మేడ గా పిలవబడే ఆరేసి గదులున్నరెండంతస్తుల మేడ  , దాటి వెళితే పెరడు అనబడే అసలైన పెరడు, అక్కడ మళ్ళీ కొన్ని గదులు,  ఆ పెరటి ద్వారం నుంచి పెరటి  వీధి లోకివెళ్లొచ్చు.  వెరసి మొత్తం 14 ద్వారాలు దాటుకుని వెళ్లదగిన ఇల్లు మాతాతగారిది. 
ఆ ఇంట్లో ప్రతీ రోజు పండగ వాతావరణం ఉండేది.  ఇంక పండగొస్తేమరింత పుంజుకునేది.   ఆ పై మా హీరో పోలిపిల్లి (మునుపు వేరే కధలోచెప్పినట్టుగా పోలిపిల్లి మా ఇంట అప్పుడప్పు వచ్చి పోయే అతిధిపనిమనిషి) వస్తే హనుమంతుడు సంజీవని ని భుజాలపై తెచ్చినట్టు పండగని భుజాల మీద వేసుకుని వొచ్చేసేది. 
ఎక్కడైనా పండగ ఆ రోజు, మహా అయితే ఒక రోజు ముందు, ఒక రోజువెనుక ఉండేదేమో. కానీ మా ఇంట్లో మాత్రం పేరుకు తగ్గట్టుగా సంక్రాంతిపెద్ద పండుగ ఒక 20 రోజులు ముందు, ఒక 10 రోజులు తర్వాత వరకూఉండేది.  
ఆ రోజుల్లో పండగల్లో తరచుగా వినబడే మాటలు. 
ఏమండీ, పండగ దులుపుళ్ళూ , కడుగుళ్లూ  అయిపోయాయా? 
సున్నాలు వేయించారా? 
అన్నట్టు సున్నాలు వేసినప్పుడు curfiew వాతావరణం ఉండేది.  పిల్లల్నెవరినీ స్వేచ్ఛగా తిరగనిచ్చేవారు కాదు.  తిరిగితే గోడలకున్న పచ్చిసున్నాలు అంటుకుని పాడు  చేస్తారని.  మా పోలిపిల్లి మాత్రం curfiew లో మిలిటరీ ఆఫీసర్ లా స్వేచ్ఛ గా తిరిగేది ఎందుకంటే సున్నాలు వేసేమేస్త్రీలకు మా పోలిపిల్లే ముఠా మేస్త్రి. 
ఇంకా ఇంటి పనులకి ఒక కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్  నిపిలిచినా నెల్లాళ్ళ ముందు నుంచీ " కుదరదండీ, పండగ కదండీ" అనేవారు. 
ఇక పది లో తొమ్మిది మంది "పండగ కి ఊర్లకి వెళ్ళిపోయేవారు".  
పండగ బట్టలు :
పండగ కి బట్టలు కొనడం మరొక పండగ వాతావరణం.  ఉబెర్ ఈట్స్ ,  swiggy డెలివరీ ఇప్పుడు వచ్చాయి అనుకుంటున్నాము కానీ ఆరోజుల్లోనే మా ఇంట్లో ప్రతీ వస్తువు కి హోమ్ డెలివరీ ఉండేది. పండగ కిఇంటిల్లిపాదికి బట్టలు, టైలర్ కూడా హోమ్ డెలివరీ జరిగేవి. మా ఇంటిఎదురుగానే ఉండే ఏకుల అండ్ సన్స్ కొట్టు నుండీ రంగు రంగులబట్టల తానులు , చీరలు, పంచెలు మనిషి తో సహా వచ్చేవాడు.  ఇంటిల్లిపాదికి బట్టల ఎంపిక సుమారు ఒక రోజంతా జరిగేది.  అంతసేపూ షాపు మనిషి ఓపికగా కూర్చునేవాడు.  ఆ రోజుల్లో ఏ వయసువారికీ రెడీమేడ్ అన్న మాటే ఉండేది కాదు. తానూ లో కట్ చేసికుట్టించేవాడు. షాప్ వాడు చొరవ చేసి, తానూ లో మిగులు ముక్కలుఉంటె ధర తగ్గించి ఇచ్చేసేవాడు.  అలా ఇచ్చిన మిగులు ముక్కాలకి మాజనరేషన్ బలి అయ్యేది . ఎలాగంటే, ఆడ పిల్లలకి గౌన్ కొత్తగా మిగిలినపువ్వుల గుడ్డ తో మా మగ  పిల్లలకి షర్ట్ కుట్టేసేవాడు టైలర్. ఆడపిల్లలు గౌన్ వేసుకున్న రోజు మేము ఆ షర్ట్ వేసుకోమని పేచీ పెట్టేవాళ్ళంమా మగపిల్లలం. 
ఇక బట్టల ఎంపిక అయినా మర్నాడు టైలర్ వచ్చి కొలతలుతీసుకునేవాడు.  టైలర్ కొంచెం డాక్టర్ లా ప్రవర్తించి ఒకసారి పిల్లలని పైనుంచి కిందకి చూసి,  "బాబేమీ పొడుగవ్వలేదు కదమ్మా , నిరుడుపండగ కొలతలు నా దగ్గర ఉన్నాయి, సరిపోతాయి అనేవాడు. ఇంకొందరిని చూసి, "బాబు  పొడుగయ్యా ధమ్మా, కొత్త కొలతలుతీసుకుంటాను అనేవాడు.".  మేము టైట్ గా కుట్టటమనే వాళ్ళం.  కానీపెద్దోళ్ళు "ఇదిగో వీరభద్రుడూ, కాస్త వదులుగా పొడవుగా కుట్టు, పిల్లలిట్టేఎదుగుతారు, రెణ్ణెళ్లకే పొట్టయిపోతాయి" అని చెప్పి మా నోరునొక్కేసేవారు. నాకు కూడా పెద్దవాళ్ళ లాగ రెండు జేబుల  బెల్ బాటమ్ప్యాంటు కుట్టించుకోవాలనుండేది. కానీ కాల యముడి లా టైలర్వీరభద్రుడు కంటి చూపు తోనే "బాబు చిన్నోడే కాదమ్మా, ప్యాంటుఎందుకూ నిక్కరు చాలు" అని నా ప్యాంటు ఆశల మీద నీళ్లుజల్లేసేవాడు.  బెల్ బాటమ్ ప్యాంటు కోసం కసిగా పెద్దయిపోవాలని ఆనాడే అనుకున్నాను.
ఇక పండగ బట్టల లో మూడవ దశ, కుట్టిన బట్టలు తెచ్చి ట్రయల్వేసుకోవడం. ఇది సుమారుగా పండగ కి రెండు మూడు రోజుల ముందుజరిగేది. 
బట్టలు బాగా కుదిరేయని కొందరి కళ్ళు మెరిసేవి,   బాగులేవని,వదులుగా ఉన్నాయని కొందరి కళ్ళు వర్షించేవి.  పెద్దలుఇవేమీ పట్టించుకోకుండా "చక్కగా ఉన్నాయర్రా" అనేవారు. 
ఇక పండగ నాడు స్నానాల ఘట్టం లోకి వద్దాం. 
పండగ స్నానాలు:
చలి కాబట్టీ అందరూ వేడి నీళ్లతో స్నానాలు చేసేవారు.  ఇంతమందికివేడినీళ్లు కాచడానికి మా ఇంట బ్రిటిష్ వారి కాలం నాటి రాగి బోయిలర్ఒకటి ఉండేది.  మా పోలిపిల్లి ఆ బోయిలర్ ని పండగ కి రెండ్రోజులముందే చింతపండు వేసి తెల్లగా తోమి పెళ్ళికూతురిలా తయారు చేసేది.  ఆ బరువైన బాయిలర్ ని ఎత్తి దాని నాలుగు కాళ్ళ స్టాండ్ మీదపెట్టగలిగేది,  ఆ బాయిలర్ క్రింద  కట్టెలు వేసి, కిరసనాయిలు వేసి, మంట రాజేసి బిందెలతో బాయిలర్ లో నీళ్లు నింపగిలిగే ఏకైక వ్యక్తి మాపోలిపిల్లి.   
మా ఇంట స్నానాల కోసం మూడు రకాల బాత్రూమ్ లు ఉండేవి. మగపిల్లల కోసం, పోత పిల్లల కోసం పై కప్పు లేని, గోడలు లేని కొళాయి గట్టుబాత్రూమ్ . 
కొంచెం ఎదిగిన పిల్లలకు, పెద్ద వాళ్లకు, గోడలు, తలుపులు ఉన్న పై కప్పులేని బాత్రూం. 
అతిధులకూ,  ఇంట మర్యాద చేయవలసిన కొత్తల్లుళ్ళూ లాంటివారికీగోడలు, తలుపులూ, పై కప్పూ ఉన్న అట్టచేడ్ బాత్రూం ల లో స్నానాలుఉండేవి. 
ఒక్క పోలిపిల్లి - చిన్నా పెద్దా కలిపి సుమారు 40 మందికి తలంటిస్నానాలు చేయించేసేది. స్నానం అయిదు నిమిషాలే అయితే, పోలిపిల్లిచేతిలో స్నానం వొద్దని ఇల్లంతా పరుగు తీసే పిల్లల్ని కోడి పిల్లల్లాఅరగంట  వెంటాడి, దొరకబుచ్చుకుని స్నాన చేయించి వీరోచితంగానవ్వేది పోలిపిల్లి.
రాయి మీద కొట్టి, వేన్నీళ్ళ లో నాన పెట్టిన కుంకుడు కాయల పులుసుకొందరికీ, శీకాకాయ సబ్బు మరి కొందరికీ ఉండేది.  షాంపూ అన్న మాటవినబడేది కాదు ఎక్కడా
స్నానాల కి ముందు పళ్ళు తోముకోవడానికి పది పైసల ఎర్ర పళ్ళ పొడిఉండేది.  ఇటుకల పొడిలా గరుగ్గా, కొంచెం తియ్యగా ఉండేది.  మాకుటూత్ పేస్ట్ మీద మనసు ఉండేది. కానీ పిల్లలకి ఆ ఎర్ర పళ్ళపొడిమంచిదని అదే ఇచ్చీవారు. 
స్నానాలలో సబ్బు కంటే ముందు, నూనె పెట్టిన నాలుగు పిండి తోతోముకునే వాళ్ళం. కళ్ళు మండుతున్నాయని ఏడుస్తూఒంటే "ఒంట్లోకుళ్ళు పోతోందని ఏడుస్తున్నాడర్రా …" అనేవారు. 
అలాగే స్నానాలకు ముందు మగ పిల్లలకి క్షవరాలకి మంగలాడు ఇంటికేవచ్చేవాడు.  పెద్దల సమక్షం లో పెద్దల ఆదేశాల మేరకు"పల్చగా క్షవరం" చేసేవాడు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి