14, ఏప్రిల్ 2012, శనివారం

పద్యాల తో'రణం' (సమస్యా పూరణం)

భావకులరా!
ఉగాది పండుగ తరువాత మీ భావావేశాన్ని ప్రక్కన పెట్టి నిత్య జీవన పోరాటంలో నిమగ్నం అయిపోయారా!? అయితే, మన పద్యాల తో'రణం' శీర్షిక క్రింద మీకొక పద్య సమస్యను ఇస్తున్నాను. దీనిని మీరు పద్య కవితగా కానీ, వచన కవితగా కానీ సమస్యా పూరణం చెయ్యవచ్చు.   

ఫెళ్ళున మధ్యకు విరుగగ
భళ్ళున తెల్లారిపోయె బ్రతుకులు ఎన్నో


ఇక మీ ఒర నుండి కవితా ఖడ్గాలను బయటకు తీసి ఝుళిపించండి, గురువారం 19 ఏప్రిల్ 2012 వరకు మీ కవితలను కురిపించండి!

మనకు (తెలుగువాహిని సభ్యులకు) ఛందస్సు నేర్పుతున్న గురువు శ్రీరామం గారికి నమస్కారాలతో.

1, ఏప్రిల్ 2012, ఆదివారం

మత్సరము లేని సంవత్సరము

ఓ అందమైన శ్రీ నందన నామ యుగాదీ నీకు వందనమమ్మా!

ధనమే ఇంధనమై నడుస్తున్న ఈ జగత్తులో
మనసు లేని అందాలపై మమకారం మాకు తగ్గించు.


గతించిన గతాలను బేతాళుని శవాల్లా భుజాన వేసుకొని
వర్తమానంలో భారంగా అడుగులు వేస్తున్న మా బరువులను తొలగించు.

ఓ అందమైన శ్రీ నందన నామ యుగాదీ నీకు వందనమమ్మా!

గతంలోని లోపాలను, చేసుకొన్న పాపాలను
పదే పదే నెమరు వేయు పాడు జీవితాలన్నీ ప్రక్షాళన చేయించు.

వర్తమానాన్ని గతానికి బలి ఇస్తూ, భవిష్యత్తుపై 'భయం' కొరడాలను ఝుళిపిస్తూ
బ్రతుకీడ్చే ఈ నికృష్టపు జీవన శైలిని మార్పించు.

ఓ అందమైన శ్రీ నందన నామ యుగాదీ నీకు వందనమమ్మా!

ఇహం లోని దేహానికి అహం బాగ తగ్గించు
భార్యా భర్తల మధ్య పంతాలూ, పట్టింపులు తొలగించు. ప్రేమ తత్వాన్ని పెంపొందించు.
మిత్రుల మధ్య డాంబికాలను తొలగించు, పరస్పర గౌరవం వృద్ది పొందించు.

బట్టలు, నగలు, వస్తు వాహనాలపై వ్యామోహం తగ్గించు,
మేము ఈ భూమికి పుట్టిన రాచ పుండులము కారాదని దీవించు!


ఓ అందమైన శ్రీ నందన నామ యుగాదీ నీకిక స్వాగతమమ్మా!!