13, జులై 2011, బుధవారం

ఆంధ్రభోజులకు ఋణగ్రస్తులం

నాకూ ఈ మధ్యే తెలిసింది తెలుగు లో "పంచ కావ్యాలు" అని ఏవో ఉన్నాయనీ, సాహిత్య పరంగా విజ్ఞుల మెప్పు పొంది, తెలుగులో తలమానికంగా నిలిచిపోయాయనీ. ఇంతకీ ఆ అయిదు ప్రబంధాలు ఏమిటీ అని శోధిస్తే, అవి:

1) అల్లసాని పెద్దన వ్రాసిన "మను చరిత్ర"
2) తెనాలి రామకృష్ణ వ్రాసిన "పాండురంగ మహత్యం"
౩) శ్రీ కృష్ణ దేవ రాయుడు వ్రాసిన "ఆముక్తమాల్యద"
4) రామ రాజ భూషణుడు వ్రాసిన "వసు చరిత్ర"
5) చామకూర వెంకటకవి వ్రాసిన "విజయ విలాసము"

అని తెలిసింది.

ఇవన్నీ కూడా విజయ నగర సామ్రాజ్య సాంస్కృతిక విప్లవ వైభవానికి నిదర్శనాలు. తెలుగు జాతికి అపురూప నిధులు. వీటిలో "ఆముక్తమాల్యద" ఇదివరకు తెలుగు వాహిని లో మనం చదువుకున్నాము. ఆముక్తమాల్యద వ్రాసిన కృష్ణదేవరాయల (1514) గారి ఆస్థానం లో అల్లసాని పెద్దన మరియు తెనాలి రామకృష్ణలు కొలువు చేసిన విషయం మనందరికీ తెలిసినదే. కృష్ణదేవరాయలి తరువాత అచ్యుత దేవ రాయలు, తరువాత సదాశివ రాయలు, తరువాత ఆలియ రామ రాయలు పరిపాలించారు. (Note : ఆలియ అంటే అల్లుడు)

ఈ ఆలియ రామ రాయలి వద్ద కొలువు చేసినందుకు "భట్టు మూర్తి" అనే కవి గారికి "రామ రాజ భూషణుడు" అని బిరుదు వచ్చిందిట. 1565 లో తళ్లికోట యుద్ధంలో అహ్మద్నగర్, బీదర్, బీజాపూర్ మరియు గోల్కొండ నవాబుల కూటమి చేతిలో ఓడి, ప్రాణాలు కోల్పోయాడు రామరాయలు. అతని తమ్ముడు, కృష్ణదేవరాయలి మరో అల్లుడు అయిన తిరుమల దేవరాయలు, రాజకుటుంబం తో పాటు రాజపోషకులనీ, అపార విజయనగర సామ్రాజ్య ఖజానానీ కూడా సురక్షితంగా అనంతపురం జిల్లా "పెనుగొండ"కు తరలించాడు. అక్కడ మళ్ళీ సామ్రాజ్యాధిపతిగా వెలసి, పరిపాలించాడు. 1570 లో, ఈయన కొలువులో రామరాజ భూషణుడు "వసు చరిత్ర" అనే ప్రభంధాన్నిరచించాడు.

అయితే, విజయనగర రాజుల సేనా నాయకులందరూ మన తెలుగు "నాయకు" లే. నేటి తెలంగాణా ప్రాంతం ఢిల్లీ సుల్తానుల వశం అయ్యాక, ఓరుగల్లు సంస్థానం వదిలి విజయనగరం చేరిన వారు వీరు. మహా శౌర్య పరాక్రమాలే కాదు, కళాసక్తి కలవారు కూడా. వీరినే, విజయనగర రాజులు "మిలిటరీ గవర్నర్లు" గా తమ సామంతాలైన కేలడి, తంజావూరు, గింగీ, కాళహస్తి, చిత్రదుర్గ, బేళూరు, చెన్నపట్న, వెల్లూరు, రాయదుర్గ మరియు కాండ్య (Kandy , శ్రీలంక), దాదాపు దక్షిణ భారత దేశమంతా నియమించారు. వీరు తెలుగు వారు కావడం, తెలుగుకి వీరి ఆస్థానాలలో పెద్ద పీట వెయ్యడంతో, తెలుగు భాషా ప్రాభవం ఆంధ్రేతర దక్షిణ భారతదేశంలో బాగా విస్తరించింది. ఈ నాటికీ అందుకే తమిళనాడు, కర్ణాటకలలో ఎంతో మంది తెలుగు వారు కనపడతారు (including త్యాగరాజు, etc.). ఈ నాయక రాజులలో ఒకరైన తంజావూరుకు చెందిన రఘునాథ నాయకుని ఆస్థానం లో, 1600 -1635 మధ్య, "చామకూర వేంకట కవి" గారు "విజయ విలాసము" అనే ప్రబంధాన్ని వ్రాసారు.

ఈ విధంగా విజయనగర రాజుల కృషి చలవనే మనకు ఈ అయిదు ఆణిముత్యాల్లాంటి కావ్యాలు లభ్యమైనాయి అనడం లో అతిశయోక్తి లేదు. వారికి నా కృతజ్ఞతాపూర్వక నివాళులు.

2 కామెంట్‌లు:

  1. చాలా బావుంది! పంచ కావ్యాల నాటి చారిత్రిక, రాజకీయ పరిస్థితుల గురించి ఆసక్తి కరమైన విషయాలు తెలియ జేశారు. మీరు ఇలాగే అనేక విషయాల మీద వారానికో టపాకు తగ్గకుండా బ్లాగాలని కోరుతున్నాము!

    రిప్లయితొలగించండి
  2. manchi vivaralu cheppavu....telugu vaari goppathanani mariyu telugu vari sahityam manamandaram marchipoye tharunam lo ila malli neelga jnapthiki teesukuvachevari avasaram telugu prajalaki entho undhi....inka manchi vivarali teliyajeyalani ani eduruchusthunannu...

    రిప్లయితొలగించండి