5, ఆగస్టు 2010, గురువారం

ఎవరు బాగా తెలుగు మాట్లాడతారు ?

ఒకసారి వేసవి సెలవులకు మా పెద్దబ్బాయి, కోడలు, ఇద్దరు మనవరాళ్ళతో టొరంటో వచ్చాడు. మా అమ్మాయి, చిన్న అబ్బాయి ఇక్కడే వుండటం వల్ల మా కుటుంబం మొత్తం కలిసామాన్నమాట. అందరం కలిసి ఆట పాటలతో కాలక్షేపం చేస్తున్నప్పుడు మా పెద్ద కోడలు ఒక ఆట మొదలు పెట్టింది. అందరం తెలుగులోనే అంటే ఒక్క ఆంగ్ల పదం కూడా దొర్లకుండా అచ్చ తెలుగులోనే మాట్లాడాలన్నమాట. ఎవరైనా పొరపాటున ఒక్క ఆంగ్ల పదం వాడినా వారు ఓడిపోయినట్లే . అలా చివరికి మిగిలినవారు గెలిచినట్లు. ఎవరికివారు ఎదుటివారు ఆంగ్లం మాట్లాడే విధంగా సంభాషణ పొడిగించి ఓడించటానికి ప్రయత్నించాలి. మా కుటుంబంలో మాచిన్నబ్బాయి, మా మనుమడు తప్ప మిగిలినవారంతా బాగా తెలుగు మాట్లాడగలిగిన వారే. మేము భారతదేశం లోనే వున్నా కేరళ రాష్ట్రంలో స్థిరపడటాన మా పిల్లల తెలుగు అంతంత మాత్రమే. అందుకే ప్రత్యేకంగా ఏరికోరి పదహారణాల అచ్చ ఆంధ్ర ఆడపిల్లలను మా కోడళ్ళుగా తెచ్చుకున్నాము. ఆట మొదలుపెట్టాకగాని ఎంతకష్టమో తెలిసిరాలేదు. మనం దినసరి ఎన్ని ఆంగ్ల పదాలు వాడుతామో అనిపించింది. కొన్ని మాటలకి సరైన తెలుగు పదాలు కూడా దొరకలేదు వెంటనే. చాలా బాగా ఆనందించాము. హేమాహేమీలనుకున్నవారంతా ఒక్కొక్కరే ఓడిపోయాం.

చివరికి గెలిచినవారెవరో తెలుసా?

తెలుగులో చాలా తక్కువ అనుకున్న మా మనవడు, రెండవ స్థానంలో మా చిన్నబ్బాయి.

ఉదా : మా మనవరాలు తల దువ్వుకున్న విధానం చూపించి ఇదేమిటని అడిగినప్పుడు 'గుర్రం తోక ' అని వెంటనే సమాధానం చెప్పటం.
మీరు ఎలా ప్రయాణం చేసారు అని అడిగినప్పుడు ' ఇంధనం సహాయంతో ఒకాయన నడుపుతున్న ఆరు చక్రాలు వున్న బండిలో' అని టక్కున సమాధానం చెప్పటం లాంటివి.

పద్మ గొల్లపూడి

4 కామెంట్‌లు:

  1. ఆట బావుందండీ! మేము కూడా ఒక సారి ప్రయత్నిస్తాము!

    రిప్లయితొలగించండి
  2. ప్రయత్నిద్దామన్నా నాతో ఆడేవల్లు యవరూ లేరండి..:(

    రిప్లయితొలగించండి
  3. telugu TV channels had tried this earlier. a family trying it out is surprising.

    రిప్లయితొలగించండి
  4. ముప్ఫైకి పైగా సభ్యులున్న ఈ గ్రూపుబ్లాగులో కొత్తటపాలు రావడం లేదెందుకని ప్రశ్నిస్తున్నా మధ్యక్షా!
    తెలుగువాహిని సభ్యులు త్వరగా మేల్కొని రోజుకొక టపా వెలువరించాలని డిమాండ్ చేస్తున్నాము!!

    రిప్లయితొలగించండి