23, జులై 2011, శనివారం

నాగబు మెలికలు

మూడు అంచలుగా నిర్మించబడిన "అమరావతీ " బౌద్ధస్ధూపం యొక్క త్రవ్వకాలలో బయల్పడిన ఒక రాతిపలక మీద "నాగబు" అనే పదముందనీ, అదే శాసనాలలోకి ఎక్కిన మొదటి తెలుగు పదమనీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ప్రకటించిన విషయాన్ని "తెలుగు వాహిని" లో మన గురువు గారు శ్రీరామమూర్తి దగ్గుపాటి గారు ప్రస్తావించారు కదా! దీనిలో కొత్త మెలిక ఏమిటంటే, ప్రభాకర శాస్త్రి గారి ప్రకటనతో నేటి పురాతత్వ శాస్త్రవేత్తలు స్వల్పముగా విభేధిస్తున్నట్లు ఈ మధ్య కొన్ని సంబంధిత రచనలలో చదివాను. "దీనికి కారణం అమరావతి లో దొరికిన చాలా శాసనాలలో చాలా చోట్ల 'నాగబుధనిక', 'నాగబుద్ది' లాంటి పేర్లు కనిపిస్తాయని, 'నాగబు' అనే మాటతో దొరికింది ఒకే రాతి ఫలకంలోని ఒక ముక్కయని, 'నాగబుధనో', 'నాగబుధనికా', లేదా 'నాగబుద్ధీ' లాంటి మాట గల శాసన శిలాఫలకం పగిలిపోగా "నాగబు" అనే భాగం ఉన్న ముక్క మాత్రమే లభించి ఉండవచ్చునన్నది వారి పరిశోధనాసారం" అంటారు ఆచార్య వెలమ సిమ్మన్న. దీనిని ప్రొఫెసర్ పేర్వారం జగన్నాథం గారు కూడా బలపరిచారు. దీని మీద ప్రచురింప బడిన కొత్త పరిశోధనల వివరాలు ఎవరికైనా తెలిస్తే తప్పక క్రింద కామెంట్స్ లో తెలుపగలరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి