16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

పద్యాల తో "రణం": రెండవ భాగం

పద్యాల తో "రణం": రెండవ భాగం
ఈ నెల తెలుగు వాహిని సమావేశం లో భాగంగా తెలుగు చిత్రపరిశ్రమలో సంగీత/సాహిత్య విలువలు దండిగా కలిగి, ఒక కళాఖండంగా నిలిచిపోయిన ఉత్తమ చిత్రం- "శంకరాభరణం" యొక్క సమీక్ష జరుగనున్నది. దీన్ని పురస్కరించుకుని ఒక సమస్యా పూరణం కావిస్తే మరింత రక్తికడుతుందని భావించి, ఈ క్రింది సమస్యని ఇచ్చాను:

"పామా శంకరుని ఆభరణం?"

దీనికి సాహితీ మిత్రులు చేసిన పద్య పూరణలు ఈ విధంగా ఉన్నాయి:

మధుబాల కరవడి గారు:
1 నడుమున వ్యాగ్యాంబరం
నడినెత్తిన చంద్రాభరణం
పామా శంకరుని అభరణం
ఫాపం అదే మిగిల్చారు నీకు దేవతాగణం

2 పామా శంకరుని అభరణం
అని తెలిగ్గా తెసేయకండి
విష నాగైనా మరకత మణిక్యమైన
ధరించేవాని బట్టి ధరణి నేలుతుంది

రవి వారణాసి గారు:
౩ వాసుకి వాసుకీ గా తల్పమై నిరంతరం
అమృత హాలహల ఐరావత మధనం
జన్మలు తరించు నీ కధలనంతరం, ఆహ, ఆ(
పామా శంకరుని ఆభరణం?

మధుబాల కరవడి గారు (మళ్ళీ):
4 ఆది శేషుగా విష్ను తల్పమైన పాము
కాళింది మడుగులొ శ్రీక్రిష్ను కాళ్ళకింద పాము
దివిలొ భువిలొ పూజలందిన పాము
అదే పామా శంకరుని అభరణం?


నెల్లుట్ల నవీన చంద్ర గారు:
6
భామా !హిమగిరి కన్యా!
ఎమాయెను నీ ధనంబు?ఎక్కడ దాచావ్
సోమాలంక్రుతూ కీయక?
పామా శంకరుని ఆభరణము? భావ్యంబా!

7
కామా తీతుందీతడు!
హేమా పతి!జగద్గురుండు! భీమాకారుం
డీ మాయావికి సబబా!
పామా శంకరుని ఆభరణము?భావ్యంబా?

8
వర మిచ్చెను పాశుపతము
హరుడా నరునకు కిరాత రూపములో;అ
చ్చెరు వయ్యెను పామా శం
కరుని ఆభరణము? ఇదేమి కర్మ ఫలంబో?


9
ధర లో పంటలు పండగ
ఉరవడి గంగను భగీరధు వినతి తోడన్
శిరసు నిలిపె!పామా శం
కరుని ఆభరణము?ఇదేమి కర్మ ఫలంబో!

10
సురులు నసురులు మధించగ
విరసమున కడలి జనించెవిషమును మ్రింగెన్
హరి అడుగగ!పామా శం
కరుని ఆభరణము?ఇదేమి కర్మ ఫలంబో!

పద్మ గొల్లపూడి గారు:
11
తలలోని నెలవంక, నుదుటి విబూదిరే ఖ,
చేతిలోని ఢమరుక, కంఠ మందు విషగుళిక,
నడుముకు పులితోలే కోక, మరి యివన్నియుగాక
అర్ధ నారీ రూపా మా శంకరుని ఆభరణం?

శ్రీరామమూర్తి దగ్గుపాటి గారు:
12
కుమారుడేతెంచు నెడను
పామా శంకరుని ఆభరణముగ దాగెన్
అమృతకరుడు జట జొచ్చెన్
హైమ మనమున ముదమందు తల్లి నుతింతున్.

13
హక్కున అర్ధాంగయె సతి
మక్కువతో నెత్తినెక్కె మరియొక సతియున్
ఎక్కడి పనుపున కంఠం
బెక్కెన్ పామా శంకరుని ఆభరణముగ?

14
గిరిజాసూయన అర్ధశ
రీరమడుగ గంగయు నెలరాజిరుకు పడన్
గిరిజకు ముదము పామా శం
కరునికి ఆభరణము బిగి సడలిన కుందెన్ .
గమనిక: ఈ పై మూడు పద్యములు కంద రీతులతో కంద పద్యములుగా వ్రాయ నే చేసిన ప్రయత్నము. ఇందులో యతి పట్టించుకొనలేదు. మూడవ పద్యములో మూడవ పాదములో రెండవ గణములో ఒక మాత్ర ఎక్కువపడింది. మీరు విశ్లేషించి సవరించిన కృతజ్ఞుడ్ని. శ్రీరామమూర్తి.
--
15
అపర్ణ తపముచే అర్ధభాగము పొందె
పాపహరిణి గంగ శిరః స్థానము పొందె
ఏ పుణ్యప్రదమున శివకంఠమున్ పొందె
ఈ పామా శంకరుని ఆభరణముగ నుతి నొందె.

16
ఉమాదేవి అర్ధనారీశ్వరి యై సృజించె దర్పణమున్
ఆ మహాదేవుని సందర్శించ, సతిన్ జూచె తర్పణమునన్
పామా శంకరుని ఆభరణము తోక భాగము తప్పె దర్పణమునన్
పామరులకు లభించె తమ దర్పము గాంచుటకు దర్పణమున్ .

గమనిక: ఈ పై రెండు పద్యములు రగడలుగా నా ప్రయత్నము.పూర్తిగా ఫలించలేదు. ఆది ప్రాస అంత్య ప్రాస లతో కొంతవరకు కుదిరినది.
అన్ని పద్యాలలోని భావము ఛందస్సు పరిశీలించి మీ అభిప్రాయములు సవరణలు తెలియపరుప ప్రార్ధన. శ్రీరామమూర్తి.
...................
అనసూయ తాడేపల్లి గారు:
17
పామా శంకరుని ఆభరణం
ఉమా ఈశానుని అర్థభాగం
సామమే శివుని హృదయ రాగం
రాగాలలో రాజమే శంకరాభరణం.

18
పామా శంకరుని ఆభరణం
కామా हम భవుని కిన్కరులం
అవుదామా సంగీతాభిమనులం
నేర్తామా రాగ శంకరాభరణం

19
పామా శంకరుని ఆభరణం
ఆభరణమా శాంకరికి అర్థభాగం
అర్థభాగమా ఓంకార నాదానునసంధానం
నాదానునసంధానమే శంకరాభరణం.

వెంకటరమణ పెద్ది గారు:
20
పామా శంకరునికి ఆభరణం
ఉమా పతి కంఠం అందు గరళం
భోళా శంకరుడు చేస్తాడు ముక్తి మార్గం సరళం

21
త్రినేత్రుడు ఐనా లయకు కారణం
భక్తులన్దరకు ఆయన చరణమే శరణం
చేద్దాము సదా శివనామ స్మరణం
"ఇతి" వెంకటరమణం

22
పామా శంకరుని ఆభరణం
విశ్వనాథుడు సినీ జగతికిచ్చినదీ ఆభరణం
సినీ ప్రపంచానికిది వాడని తోరణం
ఇంకెందరికో కావాలి అది ప్రేరణం
అర్థ రహిత సినిమాలు మన నెత్తికి "పామే" వారితో జరపాలి రణం
అందుకు మనందరం కడదామా కంకణం
కెనడా ప్రవాసాంధ్రుల భాషాసేవకిది ప్రమాణం

శ్యామ సుందర రావు గారు:
23
శివుని ఆన లేనిదే చీమైనా కుట్టదనే
నిజం తెలుసుకున్న పాము
తానే అయిందా శంకరునికి ఆభరణం?

24
బంగారం ధర కలియుగం లో భగ్గు మంటుందని
ముందే తెల్సుకున్న శివుడు పామునే చేసుకున్నాడా ఆభరణం?

25
ఉష్ణం ఉష్ణేన శీతలం
అన్న నిజం తెలియని శివుడు
మంచుకొండనే చేసుకున్నాడు నెలవు
విషానికి విషమే విరుగుడు
అనే నిజం తెలిసున్న ప్రజలు
పామా శంకరాభరణం అని
సంశయించినా నమ్మక తప్పదు మరి

26
లయకారకుడైన శివుడు తనకు తపోభంగం కలుగకుండా
ఉండేందుకే ఈ పామా శంకరాభరణం?

పావని పెద్ది గారు:
27
అమ్మ పార్వతికి ఏమిచ్చావు ఆభరణం?
చేయించావు పైపెచ్చు గంగావతరణం
అంబ తీర్చేది ఒక ఆర్తి
గంగ తీర్చేది దాహార్తి
వినాయకుడు కాగా గణాధిపతి
కార్తికేయుడే బాగైన సేనాధిపతి
ఈ శివ పరివారానికి "కలి పామా శంకరాభరణం "

జయ భారతి బంధా గారు:
28
పామా శంకరునికి ఆభరణం
కాదు అది కుండలిని యొక్క నిదర్శనము
ఒక చేత త్రిశులము మరి ఒక చేత డ మరుకము
కలిగి ఉన్న త్రినేత్రునకు అవుదామా శరణము
ఓం నమః శివాయ ఓం నమః శివాయ చేద్దాము భజనము
రాగ సంగీతమే " శంకరాభరణము"

RDL నరసింహ మూర్తి గారు:
29
కాలింది మడుగులో చిన్ని కృష్ణయ్య
పదఘ్ఘత్తనలుకు దిమ్మతిరిగిన కాలుడు
దిక్కుతోచక కైలాసంలో శరనువెడితే
శంభుడు ఆదరించిన - వోహో ఆ
పామ శంకరుని ఆభరణం.

రాజారాం రాళ్ళభండి గారు:
30
పామా శంకరుని ఆభరణం - ఏమా సమస్యా పూరణం
కామా శంకరుని భక్తులం - చేయమా నమక పారాయణం
ఉమా శంకరుని అర్ధభాగం -చేయమా నివేదన పూర్తీ భాగం
పామేకదా శంకరాభరణం

కళ్యాణి సింగరాజు:
31
పెద్దకోడుకుకి బొజ్జపైనే ఆభరణం
చన్నకొడుకు నాగ బంధన స్వరూపం,
సర్వజీవుల తత్వం తెలిసిన ప్రకృతి పురుషులకు
సుందరమే కదా పాము, శంకరుని ఆభరణం.

శ్రీమణి విద్య పసుమర్తి:
32
రజారామా ! నీ సీతకు నీవిచ్చినది అరణ్యమా?
అద్వైతధామా ! రాధాశ్యామా రాధికకు నీ విరహమా ?
రమా రమణా ! రమకు నీ కానుక వియోగామా ?
అర్ధాంగి అయి అర్ధ భాగమైన ఉమా ? లేక
పామా ? శంకరుని ఆభరణం

..................................................
విక్రమ్ సింగరాజు:

పోయిన వీకెండ్ స్మిత కోసం Louis Vuitton hand bag కొందామని డౌన్టౌన్
వెళ్ళాను. Car park చేసి, eaton సెంటర్ వైపు మన సమస్యా "పూర్ణాలు"
నెమరువేసుకుంటూ, నాలో నేనే మాట్లాడుకుంటూ, వడి వడిగా నడుస్తుండగా, దారిలో
సాక్షాత్తు శ్రీనాధ కవిసార్వభౌముడు తగిలారు. చాటువుల పితామహుడ్నిచాటుగా
చూసి..ఆయనేనా కాదా అనుకుంటుండగా, ఆయన నా ఎదుటకు వచ్చి:

"బూడిద బుంగావై, ఒడలి పోడిమిదక్కి, మోహంబు వెల్లనై
వాడల వాడాలన్ దిరిగి వారున్ వీరున్ 'చొ చొ చోయ్' అనన్
గోడల గొందునన్ దిగి గూయుచునున్నావు, ఓ toronto లో
గాడిదా! నీవునున్ కవివి గావు గదా? అనుమానమయ్యడిన్"

...అన్నారాయన.
నేను వెంటనే భుజాలు తడుముకుని, "అబ్బెబే..ఛ ఛ!
అయో! సమస్య అందించడం వరుకే నేను చేసింది. నాకంతకు మించి పాండిత్యం
లేదండీ. మా తెలుగు వాహిని లో పద్మ గొల్లపూడి గారు అనే ఆవిడ ఉన్నారు.
ఆవిడండీ కవి అంటే. ఆవిడ ఇటీవల చేసిన సమస్యా పూరణ చాలా అందంగానూ, చమత్కారం
గానూ ఉంది. ఆవిడ సాహిత్యపు contributions ఇదే విధంగా మా సభ్యుల
experience ని enrich చేయాలని నా ఆశ. నాకంత scene లేనే లేదండీ". అన్నాను.
"అలాగే, శ్రీ రామమూర్తి దగ్గుపాటి అనే ఉద్దండులు,
మాకు తెలుగు సాహితీ లోతుల్నీ, ఛందో రీతుల్నీ నేర్పుతున్నారు. వారు రగడ గా
చేసిన 'అపర్ణ తపముచే అర్ధభాగము పొందె' పూరణాపద్యం పరమోత్కుష్టంగా ఉంది.
వారిది కదా సరస్వతీ కటాక్షమనిన? ఏ నాటికైనా వారి పాళీ నుండీ కారే సీరా
పరిమళం నాకు అంటే అవకాశం ఉందేమో గానీ..ఇప్పటికి మాత్రం నేను కవిని
కానేకాదండీ." అని గట్టిగా చెప్పేశా.
"ఒహో! నేర్చుకుంటున్నాను అన్నావు గా పండితుని వద్ద.
అయితే ఇకనేం. తెలుగు ఏ మాత్రం వంటికి నాకిందో నేనూ చూస్తాను. నువ్వు కూడా
ఒకటి వదులు. ఊమ్..అందుకో" అని తెగ బలవంత పెట్టేశారు. సరే 'ఎలాగూ "గాడిద"
అని అననే అన్నారు, ఇంకేమనగలరు లే?' అన్న ధైర్యంతో ఆశువుగా మొదలెట్టాను:
(33)
"చేగట్ల పై పొర్లు బురద కొయ్య,
ముంగిట్ల ముగ్గు చెరుపు పొడల కట్ల,
మొగలి మాటుల నక్కు నల్లత్రాచు, ఏ
నాగైననేమి, పామా శంకరుని ఆబరణం? "

.....అన్నాను. ఆయన ముఖంలో యేవో రంగులు మారాయి.
(34)
"ఖీంకారము చేయు కింకరుని కడకు పంపు
వంకరల పామా శంకరుని ఆభరణం
భస్మదిగ్ధకలేబరా! నీ భీకరాకారపు ఖారము
ఉడుకారనీయకుండెన్, నిరాకార రూపాన సాక్షాత్కరింపవో"

......అని రెండొవది ముక్కి: "పై పద్యంలో 4th line లో 'నిరాకార' బదులు
'నిర్వికార' కూడా వాడచ్చునేమో నండీ." అంటూ అమాయకం గా ఆయన వైపు తిరిగాను.
ఆయనలో యేవో అవ్యక్త వికారాలు. అవి గమనించనట్టు, మూడో పద్యం లంఖించేశాను
ముగిద్దామని:
(35)
"పుర్రెల దండా అంబకు హారం
జెర్రిగొడ్డు పామా శంకరుని ఆభరణం
కర్రె గున్న సిరమా తనయుని ముఖం
వెర్రి పట్టెనో ఏమో శైవ దైవములకున్? "

....అన్నాను. అంతే! "అంత మాటన్టావురా ఖరాధమా" అంటూ విరుచుకు పడ్డారు.
నేనూ లింగాధారినేనండీ అని ఎంత చెప్పినా కనికరించరే? యతి ఉండని, ప్రాస
ఉండని, మతి ఉండని, గణం ఊసు ఉండని, రసరమ్యమైన భావం ఉండని నా పద్యాలను విని
గౌడ డిండిమభట్టు drum పగలగొట్టినట్టు పగలగొట్టారు నా బుర్ర. ఇక మీ
వంతు!!
........................

ఇలా ముగిసింది మా రెండో పద్యాలతో "రణం" శీర్షిక...వెరసి 35 పూరణలతో.

కవితానందామృత మాధుర్యరుచిని తెగ జుర్రిన తన్మయత్వం లో,
౩విక్రమ్

1 కామెంట్‌: